దేశ భద్రతా విభాగం విజయవంతం – తీవ్రవాద కుట్రను అడ్డుకున్న అధికారులు

సాక్షి డిజిటల్ న్యూస్ :దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన.. ముగ్గురు ఉగ్రవాదులను గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ATS) నవంబర్‌ 9 ఆదివారం అరెస్ట్ చేసింది. దీంతో ఉగ్రవాదులు చేసిన భారీ ఉగ్ర కుట్రను భద్రతా అధికారులు భగ్నం చేశారు. ఐసిస్‌తో సంబంధమున్న వ్యక్తులు దేశవ్యాప్తంగా దాడులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై.. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరు ఉత్తర్‌ప్రదేశ్ నుంచి వచ్చారు. వీరి వద్ద 3 పిస్తోళ్లు, 30 క్యాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. కాగా, కశ్మీర్‌లో దాడులకు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు ఇటీవల నిఘా వర్గాలు హెచ్చరిక జారీ చేసాయి. ఉగ్రవాదులను డాక్టర్ అహ్మద్ మొహిద్దిన్ కాదర్ జిలానీ, మొహమ్మద్ సుహే మొహమ్మద్ సులేమాన్, ఆజాద్ సులేమాన్ సైఫిలుగా గుర్తించారు. ఈ ముగ్గురిపై గతేడాది నుంచి గుజరాత్ ఏటీఎస్‌ నిఘా ఉంచింది. వీరు ఆయుధాలు ఎక్ఛేంజ్ చేసేందుకు గుజరాత్‌కు వచ్చారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేయాలని ప్లాన్‌ చేశారు. వీరు రెండు ఉగ్ర సంస్థలకు చెందిన వారుగా అనుమానాలు ఉన్నాయని ఏటీఎస్ అధికారులు తెలిపారు. ఏయే ప్రాంతాల్లో ఉగ్రదాడులకు ప్లాన్ చేశారో గుర్తించడానికి ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు ఐదుగురు అల్‌-ఖైదా ఉగ్రవాదులను అరెస్టు చేసారు. ఆన్‌లైన్‌లో టెర్రర్‌ మాడ్యూల్‌ను నడుపుతున్నవారితో పాటు పాక్‌లో ఉన్న ఉగ్రవాదులతో సంబంధాలు నెరపిన మహిళ కూడా వారిలో ఉంది. అంతకుముందు పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే ఆరోపణలు రావడంతో జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఇద్దరు ఎస్పీఓలపై వేటు పడింది. ఉగ్ర కార్యకలాపాలకు వీరు సాయం చేస్తున్నట్లు తేలడంతో.. విధుల నుంచి అబ్దుల్‌ లతీఫ్‌, మహ్మద్‌ అబ్బాస్‌ తొలగించారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దోడా జైలుకు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *