ఉరికొయ్యకు వేలాడిన తల్లి… పాదాల దగ్గర పసికందు గుండెలు పిండేసే వీడియో

సాక్షీ డిజిటల్ న్యూస్ :- కుటుంబ కలహాలు, ఒంటరితనం ఓ వివాహిత జీవితాన్ని విషాదాంతం చేశాయి. భర్తతో విడిపోయి మూడేళ్ల కుమారుడితో కలిసి జీవిస్తున్న ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో తీవ్ర విషాదాన్ని నింపింది. తల్లి మరణించిన విషయం తెలియని చిన్నారి.. ఆమెను నిద్రలేపేందుకు ప్రయత్నిస్తూ రాత్రంతా మృతదేహం పక్కనే గడిపాడు. ఉదయం పోలీసులు ఇంట్లోకి వెళ్లినప్పుడు కనిపించిన ఈ దృశ్యం స్థానికులను కన్నీటిపర్యంతం చేసింది.

అసలేం జరిగిందంటే..? వెంకటరమణ కాలనీలో నివాసం ఉంటున్న ఎ. స్వాతి (30) శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదోనికి చెందిన ఆమెకు హైదరాబాద్‌కు చెందిన గణేశ్‌తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమారుడు శ్రీయాన్ ఉన్నాడు. కుటుంబ కలహాల కారణంగా ఏడాది క్రితం భార్యాభర్తలు విడిపోయారు. అప్పటి నుంచి స్వాతి తన కుమారుడు, తల్లి కళావతితో కలిసి అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. మూడు రోజుల క్రితం తల్లి హైదరాబాద్‌లోని చిన్న కుమార్తె వద్దకు వెళ్లడంతో స్వాతి కుమారుడితో కలిసి ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. శుక్రవారం రాత్రి చుట్టుపక్కల వారితో మాట్లాడిన ఆమె.. రాత్రి 10 గంటల సమయంలో తల్లితోనూ ఫోన్‌లో మాట్లాడారు. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

తల్లి పక్కనే రాత్రంతా చిన్నారి.. శనివారం ఉదయం ఎంతసేపటికీ తలుపులు తెరవకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా పడకగదిలో స్వాతి మృతదేహం కనిపించింది. ఆమె పాదాల దగ్గర ఉన్న చిన్న స్టూల్‌పై బాలుడు శ్రీయాన్ స్పృహతప్పి పడి ఉండటం అందరినీ కలచివేసింది. తల్లి కదలకపోవడంతో చిన్నారి ఆమెను నిద్రలేపేందుకు ప్రయత్నిస్తూ ఏడ్చి, చివరకు అదే స్టూల్‌పై నిద్రలోకి జారుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు బాలుడిని తట్టిలేపడంతో అతడు స్పృహలోకి వచ్చాడు. ఈ దృశ్యం చూసిన స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు.. సమాచారం అందుకున్న స్వాతి తల్లి కళావతి కర్నూలుకు చేరుకున్నారు. పోలీసులు ఆమెను విచారించగా, ఒంటరి జీవితంపై విరక్తితోనే తన కుమార్తె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదు చేశారు. దీంతో కర్నూలు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తల్లి మరణం తెలియక ఆమె పక్కనే రాత్రంతా గడిపిన చిన్నారి పరిస్థితి స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

📰 ePaper