అన్నదాతా సుఖీభవ కాదు ఇది చంద్ర దుఃఖీభవ
*రైతులకు మూడేళ్ల బాకీ 32 వేలు ఎప్పుడిస్తారు ? : మాజీ మంత్రి విడదల రజిని సూటి ప్రశ్న
*చిలకలూరిపేట లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి విడదల రజిని.
సాక్షి డిజిటల్ న్యూస్ : జూన్ 22(జర్నలిస్ట్ : షేక్ మక్బూల్ బాష).పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుట్ల సభలో చంద్రబాబు రైతులకు అంతా తానే చేసినట్లు మరోసారి అబద్ధాలు వల్లెవేశారని, ఆయనకు రైతులపై అంత ప్రేమ ఉంటే సూపర్ సిక్స్ హామీ మేరకు కేంద్రంతో కలిపి రూ.26 వేలు ఎందుకు ఇవ్వడం లేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి విడదల రజిని సూటిగా ప్రశ్నించారు. అన్నదాత సుఖీభవ పథకం తొలి ఏడాది డబ్బులు పూర్తిగా ఎగ్గొట్టారని, రెండో ఏడాది నుంచి 20 వేలు మాత్రమే ఇస్తున్నారని, ఈ లెక్కన వారికి బాకీ పడ్డ 32 వేలు ఎప్పుడిస్తారని విడదల రజిని నిలదీశారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని కాస్తా చంద్ర దుఖీఃభవగా కూటమి సర్కార్ మార్చేసిందని విడదల రజిని మండిపడ్డారు. చంద్రబాబు కనీసం జగన్మోహన్ రెడ్డి రైతులకు ఇచ్చిన పథకాలు అమలు చేస్తే చాలన్నారు.ప్రెస్ మీట్లో విడదల రజిని ఇంకేమన్నారంటే….చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రంలో మీ హయాంలో ఏ ఒక్క రైతు అయినా సంతోషంగా ఉన్నారా? ఇవాళ మీరు పెట్టిన సభకు ఎంత మంది రైతులు వచ్చారు, పచ్చ కండువాలు వేసుకుని అంతా మీ వాళ్లేగా వచ్చింది. అసలైన రైతులు అక్కడికి వచ్చి ఉంటే వాళ్ల కష్టాలు, బాధలు చెప్పేవారు. మీ వాళ్లే రావడం వల్ల ఆహా ఓహో అన్నారు. ఇవాళ ఏదో స్కీం పేరు మీద బటన్ నొక్కి డబ్బులేశారని చెప్పుకుంటున్నారు. మరి 46 లక్షల మంది రైతులకు మీరు ఇచ్చిన హామీ మేరకు ఏటా 20 వేలు ఇస్తున్నారా ? అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్రంతో సంబంధం లేకుండా ప్రతీ రైతుకు 20 వేలు ఇస్తామని సూపర్ సిక్స్ హామీ ఇచ్చారుగా. ఇప్పుడు ఏటా కేంద్రం 6 వేలు ఇస్తోంది. ఈ లెక్కన కేంద్రం ఇచ్చేదాంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ రైతుకు ఏటా రూ.26 వేలు ఇవ్వాల్సి ఉంది. రెండు సంవత్సరాలకు గానూ రూ.52 వేలు ఇవ్వాల్సి ఉంది. మరి తొలి సంవత్సరం అన్నదాత సుఖీభవ డబ్బులు పూర్తిగా ఎగ్గొట్టారు. ఆ తర్వాత రెండో సంవత్సరం కేంద్రంతో కలిపి రూ.20 వేలు ఇచ్చారు. ఈ ఏడాది మళ్లీ రూ.20 వేలు ఇస్తున్నారు. ఈ లెక్కన రెండు సంవత్సరాల బాకీ కలిపి ఒక్కో రైతుకు రూ.32 వేలు ఇవ్వాల్సి ఉంది. అలాగే 7 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం డబ్బుల్లో కోత పెడుతున్నారు. మేం జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతే రాజుగా భావించి సాచురేషన్ విధానంలో అర్హత ఉన్న ప్రతీ రైతుకూ వెయ్యి రూపాయలు పెంచి మరీ రూ.13500 ఇచ్చాం. ఈ లెక్కన ఐదేళ్లలో రూ.67500 ఇచ్చాం. రైతులందరికీ ఈ డబ్బులు పక్కాగా అందాయి. అలాంటి పరిస్ధితి నుంచి ఇప్పుడు చంద్రబాబు 7 లక్షల మంది రైతులకు డబ్బులివ్వకుండా కోత పెట్టారు.పల్నాడు జిల్లాకు వచ్చిన చంద్రబాబు అన్నీ అబద్దాలే చెప్పుకున్నారు. ఇదే పల్నాడు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి హయాంలో 2023-24 ఆర్ధిక సంవత్సరానికి 2,80,181 మందికి రైతు భరోసా కింద నగదు జమ చేశారు. ఈ రోజున చంద్రబాబు హయాంలో ఇదే జిల్లాలో 2, 40, 530 మందికి ఈ పథకం అందుతుందని చెప్పారు. అంటే ఈ ఒక్క జిల్లాలోనే 40 వేల మంది రైతులకు నిధుల్ని కోతపెట్టారు. రాష్ట్రంలో 28 జిల్లాల్లో 40 వేల సగటున చూసుకుంటే ఎన్ని లక్షల మందికి కోత పెట్టారో అర్దమవుతుంది. అంటే చంద్రబాబు తాను ఇచ్చిన హామీ సైతం నిలబెట్టుకోకుండా రైతుల్ని పూర్తిగా మోసం చేస్తున్నారు. అయినా ఇంకా రైతుకు అంత చేస్తున్నా, ఇంత చేస్తున్నా అంటున్నారంటే వారి బాధలు మీకు ఏమాత్రం పట్టలేదని అర్థమవుతోంది. అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టడం చంద్రబాబు ప్రభుత్వంలోనే సాధ్యం. గతంలో 2014లోనూ సంపూర్ణ రైతు రుణమాఫీ చేస్తామన్నారు. చేశారా అని అడుగుతున్నాం. మళ్లీ 2019లో ఎన్నికలకు వెళ్తూ కొందరికి మాత్రమే ఇచ్చి మమా అనిపించారు. చంద్రబాబుకు ఏ రోజూ రైతులకు మంచి చేయాలనే చిత్తశుద్ది లేదు, రాదు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు మాటల్ని రైతులు ఎప్పటికీ మర్చిపోరు. అయినా రైతుకు భరోసా ఇస్తున్నా అన్న చంద్రబాబు మాటల్ని ఎవరూ నమ్మడం లేదు.రాష్ట్రంలో ఏ రైతును అడిగినా బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. పొగాకు, మామిడి, ఆక్వా, సెనగ, మొన్నజొన్న.. ఇలా ఏ పంట చూసినా గిట్టుబాటు ధర లేదు. రైతులు రోడ్డెక్కుతుంటే, వాళ్ల గోడు వినిపిస్తున్నా చంద్రబాబుకు పట్టడం లేదు. చంద్రబాబు మాత్రం ఇంకా అన్నదాతా సుఖీభవ అని చెప్పుకుంటున్నారు. ఇది అన్నదాతా సుఖీభవ కాదు ఇది చంద్ర దుఃఖీభవ అని మేం నామకరణం చేస్తున్నాం. అంతెందుకు ఈ పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో చంద్రబాబు మాట్లాడారు. ఇదే నియోజకవర్గం నాదెండ్లలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఆ రైతుల కుటుంబాల్ని ఆయన ఎందుకు పరామర్శించలేదు. వినుకొండలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు. ఓ సర్వేలో రోజుకు రెండు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెబుతోంది. ఇవన్నీ మీ దృష్టికి రావడం లేదా, వారి గోడు మీకు పట్టడం లేదా అని చంద్రబాబును అడుగుతున్నాం. ఓవైపు పొలంలో ఏ పంట వేసినా సచివాలయంలో కూర్చుని రియల్ టైం గవర్నెన్స్ లో మానిటరింగ్ చేస్తామంటున్నారు. దీనికి బదులు ఎక్కడెక్కడ ఆత్మహత్యలు జరుగుతున్నాయి, దానికి కారణం ఏంటి, ఆత్మహత్యల్ని ఎలా అరికట్టాలనేది సమీక్షిస్తే బాగుంటుంది. రైతుల ఇబ్బందులు చంద్రబాబు దృష్టికి రావడం లేదో, వచ్చినా స్పందించడం లేదో అర్దం కావడం లేదు. 70 శాతం వ్యవసాయాధారిత రాష్ట్రాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదో ఆయన సమాధానం చెప్పాలి. ఓ కప్పు రైస్ మాత్రమే తింటానని చెప్పుకునే చంద్రబాబు, దానికైనా రైతు వ్యవసాయం చేయాలనే విషయం ఎందుకు గుర్తించరు ? ఆ కప్పు బియ్యం కూడా చైనా నుంచి తెచ్చుకోవాలా ? పంటలకు గిట్టుబాటు ధరలు లేక, ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వక తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం, పక్కనే ఉన్న అంగన్ వాడీ కేంద్రం కూడా చంద్రబాబు పెట్టిన సభకు కూతవేటు దూరంలో ఉన్నాయి. అయినా అవి చంద్రబాబుకు కనిపించవు. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ఏ మంచీ చంద్రబాబుకు పట్టదు. మా హయాంలో పండించిన పంటకు గిట్టుబాటు ధర తెచ్చాం, రైతు భరోసా కేంద్రాల ద్వారా పంటలపై అవగాహన తెప్పించాం, ధరల స్దిరీకరణ నిధి తెచ్చాం, రైతే రాజు అని చెప్పి వెయ్యి రూపాయలు పెంచి మరీ రైతు భరోసా ఇచ్చాం. అన్ని విషయాల్లో రైతుల్ని జగన్మోహన్ రెడ్డి ఆదుకుంటే, ఇప్పుడు పూర్తి భిన్నమైన పరిస్ధితుల్ని చంద్రబాబు తీసుకొచ్చారు. చంద్రబాబు యాప్ ద్వారా యూరియా ఇస్తామంటున్నారు. రైతులు యాప్ ఎలా వాడతారు, దీని కోసం 20 వేలు పెట్టి స్మార్ట్ ఫోన్ కొనాలి కదా. పేద రైతులు స్మార్ట్ ఫోన్ కొనలేక, యూరియా ఆర్డర్ చేయలేక ఇబ్బందులు పడితే, తిరిగి వారిపైనే నెపం నెట్టేందుకు చంద్రబాబు సిద్దంగా ఉన్నారు. అలా రైతుల్ని బలిపశువుల్ని చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. మేం రైతు భరోసా కేంద్రాల్లో ఓ డిజిటల్ అసిస్టెంట్ ను పెట్టి, వాళ్ల ద్వారా రైతులకు సేవలందించాం. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో ఎక్కడా టెక్నాలజీపై శిక్షణ లేదు, అయినా రైతులకు అన్నీ చేసేస్తున్నట్లు అబద్దాలు చెప్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన తీరు మార్చుకోవాలి. మీరు కొత్తగా ఏదో చేయకపోయినా ఫర్వాలేదు, జగన్మోహన రెడ్డి హయాంలో తెచ్చిన వ్యవసాయ పథకాలు, నిర్ణయాలు అమలు చేస్తే చాలు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులకు ఎప్పుడూ రైతు బాధలు, కష్టాలు, ఆత్మహత్యలు ఎక్కువగా ఉంటాయి. అందుకే చంద్రబాబు ఎప్పటికీ రైతు వ్యతిరేకిగా మిగిలిపోతున్నారని విడదల రజిని ఎద్దేవా చేశారు