ఎర్రగొండపాలెం టీడీపీ ఆఫీసులో తెలుగు తమ్ముళ్ల రణరంగం..!
*ప్రోటోకాల్ పంచాయతీ…కొట్లాటకు దారితీసిన తెలుగు తమ్ముళ్లు..!*ఒకే పార్టీలో రెండు వర్గాలు…టీడీపీ కార్యాలయంలో రచ్చ..!*ఎర్రగొండపాలెం టీడీపీలో వర్గపోరు, కార్యకర్తల మధ్య భౌతిక ఘర్షణ..!*ఐక్యతకు బదులు కొట్లాట…టీడీపీ కార్యాలయంలో ఉద్రిక్తత..!*ఎర్రగొండపాలెం టీడీపీలో ముదురుతున్న వర్గ విభేదాలు…!*నాయకత్వ వైఫల్యమే కారణమా?
సాక్షి డిజిటల్ న్యూస్ : జులై 16(జర్నలిస్ట్ : షేక్ మక్బూల్ బాష).మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు రోజురోజుకూ బహిర్గతమవుతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తాజాగా ఎర్రగొండపాలెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మండల సమావేశం కార్యక్రమంలో పార్టీకి చెందిన ఒకే వర్గాల కార్యకర్తలు ప్రోటోకాల్ అంశంపై తీవ్ర వాగ్వాదానికి దిగడమే కాకుండా, ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.సమావేశం పార్టీ బలోపేతానికి వేదిక కావాల్సిన సమయంలో కార్యకర్తలు పరస్పరం ఘర్షణ పడటం, పార్టీ కార్యాలయంలోనే తోపులాటలు, కొట్లాటలు చోటుచేసుకోవడం నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ ఘటనను చూసిన పలువురు కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.ఇది ఒక్కరోజులో జరిగిన సంఘటన కాదని, ఇటీవల పుల్లలచెరువు మండలంలో కూడా ఒకే వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తల మధ్య బహిరంగంగా వాగ్వివాదాలు, పరస్పర ఆరోపణలు జరిగిన విషయం ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉందని స్థానికులు గుర్తుచేస్తున్నారు. వరుసగా చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు నియోజకవర్గంలో పార్టీ అంతర్గత పరిస్థితిని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.పార్టీలో క్రమశిక్షణను కాపాడాల్సిన నాయకత్వం సమన్వయం చేయడంలో విఫలమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్న చిన్న విభేదాలు పెద్ద ఘర్షణలకు దారితీసే పరిస్థితి రావడం, అసంతృప్తిని ముందుగానే గుర్తించి పరిష్కరించలేకపోవడం నాయకత్వ లోపానికే నిదర్శనమని పలువురు పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.ప్రోటోకాల్, గౌరవ మర్యాదలు, కార్యక్రమాల్లో ప్రాధాన్యత వంటి అంశాలు గత కొంతకాలంగా కార్యకర్తల మధ్య అసంతృప్తికి కారణమవుతున్నాయని సమాచారం. అయితే వీటిని సమర్థంగా పరిష్కరించే ప్రయత్నాలు కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫలితంగా చిన్నచిన్న అసంతృప్తులు ఇప్పుడు బహిరంగ ఘర్షణలుగా మారుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ నాయకత్వంపై కూడా పార్టీ శ్రేణుల్లోనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కార్యకర్తలను ఏకతాటిపై నడిపించడంలో, అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత కల్పించడంలో నాయకత్వం విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాల్సిన సమయంలో అంతర్గత విభేదాలు బహిర్గతం కావడం వల్ల ప్రజల్లో పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటోందని వారు అంటున్నారు. అయితే ఈ ఆరోపణలపై నియోజకవర్గ టీడీపీ నాయకత్వం నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. ఘర్షణకు దారితీసిన అసలు పరిస్థితులు, కారణాలపై పార్టీ ఉన్నత నాయకత్వం సమీక్ష నిర్వహించి వాస్తవాలను వెలికితీయాలని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు.రాబోయే రాజకీయ పరిణామాల దృష్ట్యా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పార్టీ అంతర్గత విభేదాలకు త్వరితగతిన పరిష్కారం చూపకపోతే అవి పార్టీ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ కార్యాలయాలు ఐక్యతకు ప్రతీకలుగా నిలవాలే గానీ, వర్గపోరుకు వేదికలుగా మారకూడదని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.